There are no items in your cart
Add More
Add More
Item Details | Price |
---|
Mon Jun 30, 2025
పరిచయం:
భారత రాజ్యాంగం, ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన రాతపూర్వక రాజ్యాంగం. ఇది దేశ ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలుస్తుంది. 1946–49 మధ్య రాజ్యాంగ సభలో జరిగిన లోతైన, సమగ్ర చర్చల ఫలితంగా ఇది రూపొందింది, దేశ చారిత్రక అనుభవాలను, సామూహిక ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సమర్థించినట్లుగా, రాజ్యాంగ నిర్మాతలు "ప్రపంచంలోని తెలిసిన అన్ని రాజ్యాంగాలను పరిశీలించి" ఒక విశిష్ట దస్తావేజును(డాక్యుమెంట్) రూపొందించారు. ఇది విశ్వవ్యాప్త ఆదర్శాలను భారతదేశ సంక్లిష్ట సామాజిక నిర్మాణం, పాలనా అవసరాలతో సమతుల్యం చేస్తుంది.
విషయం:
వివిధ రాజ్యాంగాల నుండి అనేక అంశాలను స్వీకరించినప్పటికీ, భారత రాజ్యాంగం దేశ చరిత్ర, వైవిధ్యం, అభివృద్ధి అవసరాలకు తగినట్లుగా ఆలోచనాత్మకంగా స్వీకరించబడిన ఒక విశిష్ట స్వదేశీ దస్తావేజు.
భారత రాజ్యాంగంలో స్వీకరించిన అంశాలు:
1,పార్లమెంటరీ వ్యవస్థ:
-బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించబడినది. శాసనసభకు జవాబుదారీగా ఉండే కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా బాధ్యతాయుత పాలన నిర్వహించబడుతుంది.
2. ప్రాథమిక హక్కులు:
-అమెరికా రాజ్యాంగం నుండి ప్రేరణ పొందినవి. ఇవి వ్యక్తిగత స్వేచ్ఛలను సంరక్షిస్తాయి.
3. ఆదేశిక సూత్రాలు (DPSP):
-ఐర్లాండ్ నుండి స్వీకరించబడినవి. సామాజిక-ఆర్థిక న్యాయాన్ని సాధించడంలో దేశానికి మార్గనిర్దేశం చేస్తాయి.
4. కేంద్రీకృత సమాఖ్య నిర్మాణం:
-కెనడా నుండి స్వీకరించబడినది. ఐక్యతను, ప్రాంతీయ స్వాతంత్ర్యాన్ని సమతుల్యం చేస్తుంది.
5. ప్రాథమిక విధులు:
-సోవియట్ యూనియన్ రాజ్యాంగం నుండి ప్రేరణ పొందినవి. పౌరులకు వారి బాధ్యతలను గుర్తుచేస్తాయి.
భారత రాజ్యాంగంలోని విశిష్ట లక్షణాలు:
1. సులభ మరియు దృఢత్వాలు కలయిక:
a) అమెరికా రాజ్యాంగంలా అత్యంత దృఢమైనది కాకుండా, భారత రాజ్యాంగం 368 అధికరణ కింద మూడు రకాల సవరణలను అనుమతిస్తుంది. అవి సాధారణ మెజారిటీ, ప్రత్యేక మెజారిటీ, రాష్ట్రాల అంగీకారంతో కూడిన ప్రత్యేక మెజారిటీ.
b) ఇది సమాఖ్య సమగ్రతను దెబ్బతీయకుండా ఎక్కువ అనుకూలతను అందిస్తుంది. రాజ్యాంగ పరిణామాన్ని సుగమం చేస్తుంది.
2. అత్యవసర నిబంధనలు:
a) ఆర్టికల్ 352, 356, 360 కింద అత్యవసర పరిస్థితుల్లో, భారతదేశ సమాఖ్య నిర్మాణం ఏకీకృత వ్యవస్థగా మారుతుంది.
b) ఈ విధమైన నిర్మాణం అసాధారణ పరిస్థితుల్లో జాతీయ ఐక్యత, సమగ్రతను రక్షిస్తుంది.
3. ఏక పౌరసత్వం:
a) అమెరికా ద్వంద్వ పౌరసత్వ విధానానికి విరుద్ధంగా, భారతదేశం అన్ని రాష్ట్రాల పౌరులకు ఏక పౌరసత్వాన్ని అందిస్తుంది. b) ఇది గుర్తింపు ఆధారిత చట్టపరమైన విచ్ఛిన్నాన్ని నివారిస్తుంది. వైవిధ్యమైన రాజకీయ వ్యవస్థలో జాతీయ సమైక్యతను ప్రోత్సహిస్తుంది.
4. ప్రాథమిక హక్కులు:
a) అమెరికా బిల్ ఆఫ్ రైట్స్ నుండి ప్రేరణ పొందినప్పటికీ, భారత హక్కులు పౌర-రాజకీయ స్వేచ్ఛలకు మించి అస్పృశ్యత నిర్మూలన (ఆర్టికల్ 17), దోపిడీకి వ్యతిరేకంగా రక్షణ (ఆర్టికల్ 23–24) వంటి అంశాలను కలిగి ఉంటాయి.
b) ఈ హక్కులు భారతదేశ సామాజిక న్యాయం పట్ల నిబద్ధతను ప్రతిబింబిస్తాయి. ఇది అనేక పాశ్చాత్య రాజ్యాంగాలలో స్పష్టంగా కనిపించదు.
5. మూడంచెల ప్రభుత్వ నిర్మాణం:
a) చాలా సమాఖ్య రాజ్యాంగాలు కేంద్రం, రాష్ట్రాలు అనే రెండు స్థాయిలను మాత్రమే కలిగి ఉన్నాయి. కానీ, భారతదేశం 73వ, 74వ సవరణల ద్వారా పంచాయతీలు, మున్సిపాలిటీలను రాజ్యాంగబద్ధంగా గుర్తించింది.
b) ఇది గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. భారతదేశానికి వికేంద్రీకరణ యొక్క విశిష్ట రాజ్యాంగ నిర్మాణాన్ని అందిస్తుంది.
6. ఏకీకృత న్యాయవ్యవస్థ:
a) అమెరికా ద్వంద్వ న్యాయ వ్యవస్థకు భిన్నంగా, భారతదేశం కేంద్ర, రాష్ట్ర చట్టాలను అమలు చేయడానికి ఏకీకృత న్యాయవ్యవస్థను కలిగి ఉంది.
b) ఇది చట్టపరమైన వ్యాఖ్యానంలో ఏకరూపాన్ని నిర్ధారిస్తుంది. అధికార విభజన గందరగోళాన్ని తగ్గిస్తూ, అందుబాటును మెరుగుపరుస్తుంది.
7. పార్లమెంటరీ సార్వభౌమత్వం, న్యాయ సర్వోన్నతత్వం యొక్క సమన్వయం:
a) బ్రిటన్ ను అనుసరించే సంపూర్ణ పార్లమెంటరీ సార్వభౌమత్వం, అమెరికా బలమైన న్యాయ సర్వోన్నతత్వానికి భిన్నంగా, భారతదేశం రెండింటినీ సమతుల్యం చేస్తుంది.
b) పార్లమెంటు చట్టాలను సవరించగలదు. కానీ, మౌలిక నిర్మాణాన్ని ఉల్లంఘించే సవరణలను సుప్రీం కోర్టు రద్దు చేయగలదు.
ముగింపు:
భారత రాజ్యాంగం 368 అధికరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం కల్పిస్తూ ఒక జీవన దస్తావేజుగా నిలిచి, దేశ ఆకాంక్షలకు అనుగుణంగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అదే సమయంలో దాని మౌలిక స్వరూపం విషయంలో రాజీ పడదు అనే అంశం కేశవానంద భారతి కేసు (1973) ద్వారా స్పష్టం చేసింది. ఇది నిరంతర పరిణామాల మధ్యలో కూడా ప్రజాస్వామ్య పాలన యొక్క స్ఫూర్తిని సంరక్షిస్తుంది అనడానికి ఒక ఉదాహరణ.